ముంబై, జనవరి 8: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ నాలుగేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోనున్నదని కేంద్ర ప్రభుత్వం అంచనాలను విడుదల చేయడం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. కార్పొరేట్ల మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు కూడా ప్రారంభంకానుండటం కూడా మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. వీటికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి మరింత బలహీనపడటం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 50.62 పాయింట్లు కోల్పోయి 78,148.49 వద్ద ముగిసింది.
మరోసూచీ నిఫ్టీ 18.95 పాయింట్లు కోల్పోయి 23,688.95 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించనుండటం, క్యూ3లో కార్పొరేట్లు నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశాలుండటం మార్కెట్లో తీవ్ర ఆటుపోటులకు లోనయ్యాయని, చివర్లో బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతో భారీ నష్టాల నుంచి కోలుకున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా బాండ్ ఈల్డ్‌లు పెరుగుతుండటం, ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. కానీ, టీసీఎస్, రిలయన్స్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, మారుతి లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.12 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.08 శాతం చొప్పున నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.86 శాతం నష్టపోగా, క్యాపిటల్ గూడ్స్ 1.34 శాతం, సర్వీసెస్ 1.26 శాతం, పవర్ 1.17 శాతం, యుటిలిటీ రంగ షేర్లు కుదేలవగా..ఎనర్జీ, ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, రియల్టీ, టెక్, ఐటీ రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి.
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 182.57 రెట్ల అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. రూ.410 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సంస్థ జారీ చేసిన 2,08,29,567 షేర్లకుగాను 3,80,27,59,991 షేర్ల బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ విభాగం నుంచి అత్యధికంగా 327 రెట్ల సబ్స్క్రిప్షన్ కాగా, నాన్ ఇన్స్టిట్యూషనల్ 275 రెట్లు, రిటైల్ విభాగం 64 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. సోమవారం ప్రారంభమైన ఈ వాటా విక్రయం బుధవారం ముగిసింది. ఇష్యూ సైజ్ రూ.133-140 మధ్యలో నిర్ణయించింది.
రూపాయి కకావికలమైంది. వరుసగా రెండోరోజు బుధవారం ఒకేరోజు 17 పైసలు పడిపోయి చారిత్రక కనిష్ఠ స్థాయి 85.91కి పడిపోయింది. అమెరికా కరెన్సీ డాలర్ మరింత బలోపేతం కావడం, క్రూడాయిల్ ధరలు భగ్గుమండటం వల్లనే రూపాయి భారీగా పతనమైంది.