Stocks | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరించే వాణిజ్య విధానాలు, వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వు వైఖరిలో అనిశ్చితి ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గురువారం మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డేట్ కూడా జత కలవడంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టాలతో స్థిర పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1190 పాయింట్లు (1.48 శాతం0 నష్టపోయి 79,043.74 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 80,447.40 పాయింట్ల గరిష్టానికి చేరుకుని 78,918.92 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 360.75 పాయింట్లు పతనమై 23,914.15 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్‌లో 24,345.75 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. 23,873.35 పాయింట్ల కనిష్టానికి పతనమైంది. ఉక్రెయిన్ విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులపై రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేయడంలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతాయన్న భయాల మధ్య ఈక్విటీ మార్కెట్లు పతనం అయ్యాయి.
ఎన్ఎస్ఈ -50లో 46 స్టాక్స్ నష్టాలతో సరి పెట్టుకున్నాయి. ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ 5.43 శాతం వరకూ నష్టపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ, సిప్లా స్టాక్స్ మాత్రం 1.63 శాతం వరకూ లాభ పడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇండెక్స్‌లు 0.05 శాతం చొప్పున పతనం అయ్యాయి. అత్యధికంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రెండు శాతానికి పైగా నష్టపోగా, నిఫ్టీ ఆటో, ఫైనాన్సియల్స్, ప్రైవేట్ బ్యాంక్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ పీఎస్ యూ బ్యాంక్, మీడియా ఇండెక్స్‌లు 0.93 శాతం వరకూ లాభ పడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ -30 ఇండెక్స్‌లో ఎస్బీఐ మినహా అన్ని షేర్లు నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 73 డాలర్లు, ఔన్స్ బంగారం 2645 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.