Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో పాటు మెటల్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ స్టాక్స్ రాణించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,278.49 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 80,910.03 పాయింట్ల కనిష్టానికి పడిపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. ఈ క్రమంలో 81,691.87 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 182.34 పాయింట్ల లాభంతో 81,330.56 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88.55 పాయింట్ల లాభంతో 24,666.90 వద్ద ముగిసింది.
దాదాపు 2,749 షేర్లు లాభపడగా.. 1,085 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎటర్నల్ ప్రధానంగా లాభాలను ఆర్జించాయి. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం పెరిగాయి. బ్యాంకు మినహా మిగతా రంగాల సూచీలన్నీ రియాల్టీ, చమురు, గ్యాస్, టెలికాం, మీడియా, ఐటీ, మెటల్ సూచీలు 1-2.5 శాతం పెరిగాయి.