Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ గడువు దగ్గరపడుతుండడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,685.66 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. అయితే, పొద్దంతా మార్కెట్లు పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. ఇంట్రాడేలో 83,572.51 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 83,874.29 పాయింట్ల మార్క్‌ని తాకింది. చివరకు 90.83 పెరిగి 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 24.75 పాయింట్లు పెరిగి 25,541.80 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్వల్ప నష్టాలతో ముగియడంతో విస్తృత సూచీల ఏడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. రంగాలవారీగా చూస్తే.. ఎఫ్ఎంసీజీ, మీడియా, పవర్ 0.4-1.3 శాతం వరకు తగ్గాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.7శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. అపోలో హాస్పిటల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఆసియన్ పెయింట్స్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించాయి.
యాక్సిస్ బ్యాంక్, నెస్లే, శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, ట్రెంట్ నష్టపోయాయి. సిగాచి ఇండస్ట్రీస్ షేర్లు 5శాతం పతనమయ్యాయి. తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో పాశమైలారంలోని ప్లాంట్‌లో రియాక్టర్ పేలడంతో 30 మందికిపైగా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ షేర్లు వరుసగా రెండోరోజు పడిపోయాయి. పునర్నిర్మాణ ప్రణాళిక నేపథ్యంలో గాబ్రియేల్ ఇండియా షేర్లు 20శాతం పెరిగాయి. రూ.989 కోట్ల విలువైన ఆర్డర్ల విజయంతో కల్పతరు ప్రాజెక్ట్స్ షేర్లు 2శాతం వృద్ధి చెందాయి. మోర్గాన్ స్టాన్లీ డౌన్‌గ్రేడ్ తర్వాత డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు పతనమయ్యాయి. క్యూ1 డిపాజిట్ల తర్వాత కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 2 శాతం పెరిగాయి. ఇక బీఎన్సీలో 150 కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. ఇందులో జేకే లక్ష్మీ సిమెంట్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, సిటీ యూనియన్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఫెడరల్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, లారస్ ల్యాబ్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దీపక్ ఫెర్టిలైజర్స్, నవీన్ ఫ్లోరిన్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎంసీఎక్స్ ఇండియా, హ్యుందాయ్ మోటో, ఎల్టీ ఫైనాన్స్, రామ్‌కో సిమెంట్స్, మాక్స్ హెల్త్‌కేర్, మాక్స్ ఫైనాన్షియల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, పూనావాలా ఫిన్‌కార్ప్ ఉన్నాయి.