Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం సైతం సూచీలు పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మినహా మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,917.65 నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు మరింత పతనయ్యాయి. మధ్యాహ్నం తర్వాత కోలుకున్నా.. చివరకు మళ్లీ దిగజారాయి. ఇంట్రాడేలో 81,607.84 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. 82,045.47 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరకు 386.47 పాయింట్లు తగ్గి 81,715.63 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 112.60 పాయింట్లు తగ్గి 25,056.90 వద్ద స్థిరపడింది. దాదాపు 1,535 షేర్లు లాభపడగా.. 2,445 షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 0.9శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5శాతం తగ్గాయి.
నిఫ్టీలో టాటా మోటార్స్, విప్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్షియల్, హీరో మోటోకార్ప్ భారీగా నష్టపోయాయి. హెచ్‌యూఎల్, నెస్లే, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ మినహా మిగతా అన్నిరంగాల సూచీలు ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఆయిల్, గ్యాస్, రియాల్టీ 0.5 నుంచి 2శాతం వరకు నష్టపోయాయి. ‘మోర్ఫీ రిచర్డ్స్’ బ్రాండ్‌ను కొనుగోలు చేయడంతో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేర్లు లాభపడ్డాయి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్ప్, ఇండియన్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అసహి ఇండియా, కెనరా బ్యాంక్, ఆధార్ హౌసింగ్, మారుతి సుజుకి, అంబర్ ఎంటర్ప్రైజెస్, ముత్తూట్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టాటా స్టీల్ సహా 170కి పైగా స్టాక్స్ బీఎస్ఈలో 52 వారాల గరిష్ట స్థాయికి చేరాయి.