Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. క్రితం సెషన్‌తో పోలిస్తే స్వల్ప లాభాల్లోనే సూచీలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుతున్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్ట్ ఉదయం 74,175.93 పాయింట్ల వద్ద మొదలైంది. ప్రారంభంలో 74,187.35 పాయింట్లకు పెరిగిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 73,433.91 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 616.75 పాయింట్ల నష్టంతో.. 73,502.64 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 160.90 పాయింట్లు నష్టపోయి.. 22,332.65 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,005 షేర్లు లాభాల్లో ట్రేడవగా.. 2,790 షేర్లు క్షీణించాయి. మరో 131 షేర్లు మారలేదు. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఎస్బీఐ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, నెస్లే ఇండియా, సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్టీ, మెటల్, పవర్ 0.5-1శాతం చొప్పున క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2శాతం పతనమయ్యాయి.