Stock Market Close | 2024 సంవత్సరం చివరిరోజున దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII’s) పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి పతనం నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు.. చివరకు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 77,982.57 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది.
ఇంట్రాడేలో 78,305.34 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 77,560.79 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 109.12 పాయింట్ల నష్టంతో 78,139.01 వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్లాట్గా ముగిసింది. 0.100 పాయింట్లు తగ్గి.. 23,644.80 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2,120 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 1,370 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రిక్స్, ఓఎన్జీసీ, కొటక్ మహీంద్రా, ట్రెంట్, కోల్ ఇండియా, ఐటీసీ, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ లాభాల్లో కొనసాగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా నష్టాల్లో ముగిశాయి.