Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించనున్నది. ఈ సారి వడ్డీ రేట్లలో కోత విధింవచ్చన్న ఊహాగానాలున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అదే సమయంలో రూపాయి పతనం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మార్కెట్లో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మదుపరులు లాభాల స్వీకరణకు దిగుతుండడంతో మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. బుధవారం వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టపోయాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,666.26 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది.
ఆ తర్వాత కొద్దిసేపటికే సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకున్నది. ఇంట్రాడేలో 80,868.02 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 80,050.07 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. చివరకు 502.25 పాయింట్ల నష్టంతో 80,182.20 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 137.15 పాయింట్లు పతనమై.. 24,198.85 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,379 షేర్లు పురోగమించాయి. మరో 2,456 షేర్లు పతనం కాగా.. మరో 92 షేర్లు మారలేదు. ఇక సెక్టోరల్ ఫ్రంట్‌లో ఫార్మా ఒకశాతం పెరిగింది. ఆటో, ఎనర్జీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, మీడియా, రియాల్టీ 0.5 శాతం నుంచి 2 శాతం వరకు దిగజారాయి. నిఫ్టీలో ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, విప్రో, బజాజ్ ఆటో లాభాల్లో సాగగా.. టాటా మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్ప్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున తగ్గాయి.