Stocks | కెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్‌లు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై సోమవారం ప్రతికూల ప్రభావం పడింది. కెనడా, మెక్సికోలపై 25శాతం, చైనాపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అక్రమ వలసలు, డ్రగ్స్ ట్రేడ్‌పై పోరాటానికి ఈ సుంకాలు విధించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 319.22 పాయింట్ల (0.41శాతం) పతనంతో 77,186.74 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్‌లో 77,260.37-79,756.09 పాయింట్ల మధ్య తచ్చాడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 121.10 పాయింట్లు (0.52 శాతం) నష్టపోయి 23,361.05 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23,381.60 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23,222 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది.
బీఎస్ఈ – 30 సెన్సెక్స్‌లో లార్సన్ అండ్ టర్బో, టాటా మోటార్స్, హిందూస్థాన్ యూని లివర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు నష్టపోగా, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి స్టాక్స్ లాభ పడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 76.59 డాలర్ల వద్ద నిలిచింది. ఔన్స్ బంగారం 2829 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
ఎన్ఎస్ఈ – 50లో 35 స్టాక్స్ నష్టపోయాయి. లార్సెన్ అండ్ టర్బో, టాటా కన్జూమర్, హీరో మోటో కార్ప్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ 4.67 శాతం వరకూ నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, శ్రీరాం ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర 13 స్టాక్స్ 5.12 శాతం వరకూ లాభ పడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఫార్మా, హెల్త్ కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్ లాభాలతో స్థిర పడ్డాయి.