Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం జోరును కొనసాగించాయి. నిఫ్టీ ఈ ఏడాది సెంబర్ 20 తర్వాత తొలిసారిగా 20వేల మార్క్‌ను దాటగా.. సెన్సెక్స్ 727 పాయింట్లకుపైగా పెరిగింది. ఇవాళ ఉదయం మార్కెట్లు లాభాలతో మొదలవగా.. చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. రెండు సూచీలు రెండు నెలల తర్వాత మరోసారి గరిష్ఠ ముగింపు నమోదు చేయగా.. మరో వైపు బీఎస్ఈలో మదుపరుల సంపద తొలిసారిగా 4లక్షల కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది.
అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు ఉన్నా దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో పయనించాయి. ఉదయం సెన్సెక్స్ 66,381.26 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,946.28 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. 66,374.52 వద్ద కనిష్ఠాన్ని చేసిన సెన్సెక్స్ 727.71 పాయింట్ల లాభంతో 66,901.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 206.90 పాయింట్లు పెరిగి.. 20,096.60 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో దాదాపు 1828 షేర్లు పురోగమించగా, 1706 షేర్లు క్షీణించాయి. 123 షేర్లు మారలేదు. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, ఎంఅండ్ఎం యాక్సిస్ బ్యాంక్, విప్రో, టాటా మోటార్స్ టాప్ గెయినర్లు నిలిచాయి. ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, దివీస్ ల్యాబ్ నష్టపోయాయి. రియాల్టీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఒక్కోశాతం వృద్ధి చెందాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.