Nirmala Sitaraman | ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయమై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్రాలు అనుకూలంగా లేవన్నారు. జై సల్మేర్‌లో శనివారం 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘క్రూడాయిల్ బాస్కెట్లో ఉన్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్)ను విడిగా జీఎస్టీ పరిధిలోకి తేవడానికి వారు అనుకూలంగా లేరు. ఏటీఎఫ్ మీద జీఎస్టీ యధాతథంగా కొనసాగుతుంది’ అని చెప్పారు.
అలాగే బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు విషయమై కూడా నిర్ణయం తీసుకోలేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం మరింత అధ్యయనం జరుపాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీమారంగ నియంత్రణ సంస్థ ‘ఐఆర్డీఏఐ’ అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని, అందుకు మరి కొంత సమయం పడుతుందన్నారు.
ఫోర్ట్ ఫైడ్ బియ్యం పై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జన్యుపరమైన చికిత్సలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. రుణ గ్రహీతలపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)లు వేసే జరిమానాల మీద జీఎస్టీని తొలగించారు. అలాగే రూ.2000 లోపు పేమెంట్స్ జరిపే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇది పేమెంట్ గేట్ వేలు, ఫిన్ టెక్ సంస్థలకు వర్తించదు. ఇక ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ స్విగ్గీ, జొమాటోలపై విధించాల్సిన పన్నురేట్లపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ఆమె చెప్పారు.