హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సాంకేతిక పరిజ్ఞానం నిజమైన గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో ఇక్కడ ఓ హోటల్ జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజటలైజేషన్ అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని, కరోనా తరువాత డిజిటలైజేషన్ ప్రభావం మరింత పెరిగిందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదన్న ఆయన..ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఐటీ రంగం ముందుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేండ్లుగా ఐటీ రంగంలో తెలంగాణ అసమాన ప్రతిభను కనపరుస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో విజయవంతంగా ముందుకు సాగుతుందని ప్రశంసించారు. ఇక్కడి భూములకు భారీగా విలువలు పెరిగాయని, మెట్రోతో రవాణా సౌకర్యం పెరిగిందని, మెట్రోను విస్తరించడం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.