హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో ‘నేషనల్ డిజైన్ సెంటర్’ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించిన పలు అంశాలపై పీయూష్ గోయల్‌కు మంత్రి వినతి పత్రం అందజేశారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ. 8,500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు హ్యుందాయ్ గ్రూప్ ముందుకొచ్చినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో అకడ లాజిస్టిక్ హబ్ అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలని ఆయన కోరారు. భవ్య పథకం ఫేజ్-1లో భాగంగా రాష్ట్రంలో 15 నుంచి 20 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్‌లను సిద్ధం చేస్తున్నదని, వీటికి జూన్-జూలై 2026 దరఖాస్తు విండోలోనే అనుమతి ఇస్తే రాష్ట్రంలో తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రానికి ‘ఏరో-డిఫెన్స్ కారిడార్‌ను మంజూరు చేయాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు.
మెగా లెదర్, ఫుట్ వేర్ అండ్ యాక్సెసరీస్ క్లస్టర్ డెవలప్మెంట్ (ఎంఎల్ఎఫ్ ఏసీడీ) పథకం కింద రెండు మెగా లెదర్ పారులను కేటాయించాలని, మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో రూ. 2,050 కోట్లతో ఎన్హెచ్ఎల్ఎంఎల్ భాగస్వామ్యంతో చేపట్టిన మల్టీ మాడల్ లాజిస్టిక్ పారుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేస్తున్న ఇర్రేడియేషన్ ఫెసిలిటీకి ‘ట్రేడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్’ పథకం కింద నిధులను కేటాయించాలని, అలాగే పామాయిల్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీటి దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.