హైదరాబాద్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): వచ్చే ఐదేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి… తద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. మెల్బోర్న్లో ‘ఆస్ బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన మాట్లాడుతూ.. ఈ రంగం రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, ఇక్కడ పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామన్నారు. తెలంగాణను ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ ’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. సెల్ అం డ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్- డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, డయాగ్నస్టిక్స్, మెడ్ టెక్, ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ , హెల్త్ టెక్, ఏపీఐ బల్ డ్రగ్, ఫార్మా ప్యాకేజింగ్, గ్లాస్ ట్యూబింగ్, ట్రాన్స్ లేషనల్ బయోటెక్ రీసెర్చ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిసవరీ, జీనోమిక్స్ , గ్రీన్ బయో మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి బయోటెక్, యానిమల్ హెల్త్ తదితర రంగాల్లో రాష్ట్రంలో అవకాశాలు పుషలంగా ఉన్నాయని శ్రీధర్ బాబు పేరొన్నారు.