హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా చిన్నదైనా ఆశయాలు, ఆచరణలో చాలా పెద్దదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని, జీడీపీఎస్ జాతీయ సగటుకన్నా అధికంగా ఉందని, దేశ జీడీపీలో 5శాతం వాటా తెలంగాణదేనని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు యూఏఈ సంయుక్తంగా గురువారం హైదరాబాద్‌లో ‘ఇన్వెస్టోపియా గ్లోబల్’ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఎగుమతులు, ఏరోస్పేస్, డిఫెన్స్, తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ మొబిలిటీ, పర్యాటకం, వెల్నెస్, మెడికల్ తదితర రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన యూఏఈ ప్రతినిధులను ఆహ్వానించారు. 2024-25లో యూఏఈకి తెలంగాణ ఎగుమతులు 2.5 రెట్లు పెరిగాయన్నారు.