హైదరాబాద్, జూన్ 28: అతిపెద్ద స్పోర్ట్స్ బెట్టింగ్, గేమింగ్ గ్రూపు అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎంటైన్…హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. 2 వేల సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో టెక్నాలజీ డెవలప్మెంట్కు సంబంధించి కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ నూతన సెంటర్లో 3,400 మంది ప్రతిభ కలిగిన ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. గ్రూపు గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, టెక్నాలజీ సర్వీసులు, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ ప్లాట్‌ఫాం, డిజైనింగ్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఈ సెంటర్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది.
గతంలో ఇవ్వీ బ్రాండ్‌తో టెక్నాలజీ సేవలు అందించిన సంస్థ..ప్రస్తుతం తన పేరును ఎంటైన్ ఇండియాగా మార్చుకున్నది. హైదరాబాద్‌లో అతిపెద్ద ఆఫీస్ కలిగివున్న సంస్థకు..పుణెలో మరో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నది. దీంట్లో 100 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా ఎండీ అంతిల్ అన్బళగన్ మాట్లాడుతూ.. మా కొత్త హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభంతోపాటు రీబ్రాండింగ్ మా పరిణామాన్ని ప్రతిభింబించనున్నది.
భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఆవిష్కరణలకు పెద్దపీట వేయడంతోపాటు ప్రపంచ ఆశయాలకు అనుగుణంగా పలుచర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 2001లో హైదరాబాద్‌లో తమ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంటైన్ ఇండియా..ప్రస్తుతం సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను 3,400కి పెంచుకున్నది. గడిచిన సంవత్సరంలోనూ 800 మందిని రిక్రూట్ చేసుకున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా మరింత మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.