SpiceJet | సుప్రీంకోర్టు హెచ్చరికతో దేశీయ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్’ యాజమాన్యం దిగొచ్చింది. స్విట్జర్లాండ్ బ్యాంక్ దిగ్గజం ‘క్రెడిట్ సూయిజ్’కు 15 లక్షల డాలర్ల బకాయిలు గురువారం (సెప్టెంబర్ 14, 2023) చెల్లించినట్లు ప్రకటనలో తెలిపింది. ‘క్రెడిట్ సూయిజ్’ బకాయిలు చెల్లిస్తారా, లేక తీహార్ జైలుకెళతారా? తేల్చుకోండంటూ స్పైస్ జెట్ ఎయిర్వేస్ చైర్మన్ అజయ్ సింగ్‌కు సోమవారం కఠిన పదజాలంతో కూడిన హెచ్చరికలు చేసింది సుప్రీంకోర్టు.‘సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా `క్రెడిట్ సూయిజ్’ బ్యాంకుకు 15 లక్షల డాలర్లు గురువారం (సెప్టెంబర్ 14) నాడు చెల్లించాం’ అని స్పైస్ జెట్ వెల్లడించింది.
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం ‘క్రెడిట్ సూయిజ్’కు 10 లక్షల డాలర్ల డిఫాల్ట్ మొత్తంతోపాటు ఐదు లక్షల డాలర్ల వాయిదా పేమెంట్‌ను ఈ నెల 22 లోగా చెల్లించాల్సిందేనని స్పైస్ జెట్’కు జస్టిస్‌లు విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆల్టిమేటం ఇచ్చింది. ‘క్రెడిట్ సూయిజ్’తో సెటిల్మెంట్ ప్రకారం కట్టుబడి ఉండే విషయమై స్పైస్ జెట్ దాగుడుమూతల పట్ల న్యాయస్థానం మండి పడింది. అజయ్ సింగ్ తన హామీకి కట్టుబడి ఉండాలని హెచ్చరించింది.`స్పైస్ జెట్ చాలా ఎక్కువ చేస్తున్నది. మీరు మరణించినా పర్వాలేదు.. కానీ మీరు మనీ పే చేయకుంటే తీహార్ జైలుకు పంపిస్తాం` అని స్పష్టం చేసింది.