GDP | న్యూఢిల్లీ, మే 2 : భారత జీడీపీ అంచనాలకు ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్అండ్పీ కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ వృద్ధిరేటు 6.3 శాతంగానే ఉండొచ్చని శుక్రవారం పేర్కొన్నది. ఇంతకుముందు అంచనా 6.5 శాతంగా ఉండటం గమనార్హం. ‘ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థ సమాచారం : ఆర్థిక వృద్ధిని నెమ్మదింపజేస్తున్న అమెరికా వాణిజ్య విధానంలోని భారీ మార్పులు’ పేరిట ఓ నివేదికను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగానే గతంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి సంబంధించి పేర్కొన్న అంచనాలను సవరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలకు తెరలేపడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అయితే చైనా మినహా మిగతా దేశాలపై విధిస్తామన్న టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేయడం కొంతలోకొంత ఊరనిచ్చింది. ఈ క్రమంలోనే భారత్‌సహా ఆయా దేశాలు.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే పనిలోపడ్డాయి. అయినప్పటికీ ఈ ట్రేడ్ వార్‌పై అనిశ్చిత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉండటంతో.. ఆ సెగ ఇప్పుడు దేశ జీడీపీ అంచనాకు తాకింది. నిజానికి ఈ ఏడాది మార్చిలోనే దేశ వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5 శాతంగానే ఉండొచ్చని ఎస్అండ్పీ అంచనా వేసింది. అంతకుముందు ఇది 6.7 శాతంగా ఉంటుందన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో 0.2 శాతం మేర తగ్గొచ్చని ప్రకటించింది. ఈ లెక్కన చూసుకుంటే జీడీపీ అంచనాకు దాదాపు అర శాతం కత్తెర పడినట్టే అనుకోవచ్చు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చని ఎస్అండ్పీ అంటున్నది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఆఖరుకల్లా 88 స్థాయికి దిగజారవచ్చని ఎస్అండ్పీ ఈ సందర్భంగా తమ రిపోర్టులో పేర్కొన్నది. ప్రస్తుతం 84.57 వద్ద రూపీ వాల్యూ కదలాడుతుండగా.. 2024 చివర్లో 85.64 వద్ద ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకానైతే రూపాయి మారకం విలువ రూపాయికిపైగానే కోలుకున్నట్టు కనిపిస్తున్నది. అయితే గడిచిన ఈ 4 నెలల్లో తీవ్ర ఒడిదొడుకులనూ చవిచూసింది. ఫిబ్రవరి 6న మునుపెన్నడూ లేనివిధంగా 87.59 స్థాయికి క్షీణించింది. ఒకానొక దశలో 87.60 స్థాయినీ తాకింది. ఈ నేపథ్యంలో ఎస్అండ్పీ అంచనా మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. మళ్లీ రూపాయి ఒత్తిడికి లోనవబోతున్నదన్న సంకేతాలనిస్తున్నది.