Office Space | న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో దక్షిణాది రాష్ర్టాలదే హవా కనిపిస్తున్నది. టాప్-7 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజుల్లో 59 శాతం వాటా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలదేనని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తమ తాజా నివేదిక ‘ది కనెక్ట్ క్యూ2 2023’లో స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, ముంబై, కోల్‌కతాల్లో 13.9 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజింగ్ జరిగింది. అయితే బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో జరిగినదే 8.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నదని గురువారం బెంగళూరు ఆధారిత రియల్టీ సంస్థ వెస్టియన్ వెల్లడించింది.
అందుబాటులోకి మరింత స్పేస్
ఈ ఏప్రిల్-జూన్‌లో గతంతో పోల్చితే ఆఫీస్ స్పేస్ ఎక్కువగా అందుబాటులోకి వచ్చిందని వెస్టియన్ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. ఇక ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో టెక్నాలజీ రంగ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇంజినీరింగ్, తయారీ రంగాల కంపెనీలున్నాయి. కాగా, ఫ్లెక్సిబుల్ స్పేసెస్కూ ఆదరణ పెరిగింది.