హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ప్రారంభించనున్నట్టు కంపెనీ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. పునరుత్పాదక విద్యుత్తు పెంపుదల కోసం సంస్థ మందమర్రి ఏరియాలోవున్న 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు అనుబంధంగా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను ఇటీవల ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
ఇది ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక ప్లాంట్ అని, దీనిని రెండు, మూడురోజుల్లో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రూ. 2.73 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ వల్ల కంపెనీకి ఏడాదికి సుమారుగా 9.1 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్తును సరఫరా చేయనుండగా, తద్వారా రూ.70 లక్షల వరకు ఆదాకానున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.