Skoda Auto Volkswagen India | ప్రముఖ జెక్ ఆటోమొబైల్ సంస్థ- స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా (Skoda Auto Volkswagen India) బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్ల విక్రయం విషయమై రూ.11 వేల కోట్ల పై చిలుకు (1.4 బిలియన్ల అమెరికా డాలర్లు) కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడిందని పేర్కొంటూ స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా యాజమాన్యానికి పన్ను అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ స్కోడా ఆటో.. బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై చట్టానికి లోబడి న్యాయపరమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా తెలిపింది. జాతీయ అంతర్జాతీయ చట్టాలు, రెగ్యులేషన్స్‌కు లోబడి పని చేసేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొంది.
భారత్‌లో స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గ్రూప్ సారధ్యంలో ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ పని చేస్తోంది. ఆడి, ఫోక్స్ వ్యాగన్, స్కోడా బ్రాండ్ల పేరిట కార్లు విక్రయిస్తోంది. ఒక్టావియా, సూపర్బ్, కొడియాక్, పస్సాట్, జెట్టా, టిగువాన్ తదితర మోడల్ కార్లు భారత్‌లో అమ్ముడవుతున్నాయి. స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ సంస్థ తాము దిగుమతి చేసిన కార్లు, వాటి విడి భాగాల విషయమై తమకు తప్పుదోవ పట్టిస్తున్నదని పన్ను అధికారులు ఆరోపిస్తున్నారు. 2019లో మూడు కార్ల తయారీ సంస్థలు స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అనే పేరు కింద పని చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.