హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ప్రముఖ బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి..అంతర్జాతీయంగా తన వ్యాపార విస్తరణను వేగవంతం చేయబోతున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన సంస్థ..తాజాగా ఘనా దేశంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అక్కడ పెట్టుబడులు పెట్టేయోచనలో ఉన్నది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని సింగరేణి సంస్థను ఆ దేశం ఆహ్వానించింది కూడా. హైదరాబాద్ పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ ప్రతినిధుల బృందం సింగరేణి సీఎండీ ఎన్ బలరాంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రపంచంలో వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీసు, లిథియం వంటి ఉత్పత్తులకు ప్రముఖ దేశంగా పేరొందిన ఘనాలో పెట్టుబడులు పెట్టే విషయంపై వచ్చే నెల రోజుల్లో కంపెనీ అధికారుల బృందాన్ని ఆ దేశానికి పంపిస్తామని బలరామ్ చెప్పారు. సీఎండీని కలిసిన వారిలో ఘనా దేశ ప్రతినిధులు అబ్దుల్ సలాం మోర్గాన్ అగ్బోటు, అహ్మద్ ఉమర్ సాండా, మైకెల్ మహామ, మెగ్తారి హుడు, అగ్రే ఎలిషమా ఫ్రెడరిక్ ఉన్నారు.
50 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేయండి
సింగరేణి ఒప్పంద కార్మికుల ప్రమాద బీమాను రూ. 50 లక్షలు అందించాలని బలరాం పలు బ్యాంకు అధికారులను కోరారు. ఉద్యోగుల సహజ మరణానికి రూ. 20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. శనివారం సింగరేణి భవన్లో పలు బ్యాంకు అధికారులతో సీఎండీ సమావేశమయ్యారు. ఆయా అంశాలపై బ్యాంకర్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.