హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 160 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేయాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది తొలి మూడు నెలలు ఉత్పత్తికి అత్యంత అనుకూలంకావడంతో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రోజుకు 1,200 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ (ఓబీ) ను తొలగించాలని అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు. గతేడాది ఏప్రిల్ నెలలో 5.66 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేయగా, ఈసారికిగాను 5.81 మిలియన్ టన్నులు (2.7శాతం వృద్ధి) నమోదుచేశామన్నారు. మహిళా ఉద్యోగులను పెంచేందుకు ఓపెన్‌కాస్టు, భూగర్భ గనిని వారికి కేటాయించి, ఒక షిప్టును వారితోనే నడపాలని ఆయన సూచించారు.