హైదరాబాద్ జూన్ 12 (నమస్తేతెలంగాణ): సింగరేణి తాజాగా కీలక ఖనిజాల అన్వేషణ, పరిశోధన రంగాల్లో తొలి అడుగు వేసింది. ఈ దిశగా సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్), ఐఎంఎంటీ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ వీకే సారస్వత్ సమక్షంలో సింగరేణి జీఎం (ఎక్సోరేషన్) బీ శ్రీనివాస్, జీఎం(బీడీ అండ్ఎస్పీ) రామదాసు, సీఎస్ఐఆర్, ఐఎంఎంటీ చీఫ్ సైంటిస్ట్..హైడ్రో మెటలర్జీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ కాళీ సంజయ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా సింగరేణి చైర్మన్ బలరాం మాట్లాడుతూ… వ్యాపార విస్తరణలో భాగంగా ప్రభుత్వాల సూచనల మేరకు కీలక ఖనిజాల అన్వేషణలోకి అడుగు పెట్టామన్నారు. ఈ రంగంలో సీఎస్ఐఆర్-ఐఎంఎంటీలు సాంకేతిక సహకారం అందిస్తాయని వెల్లడించారు. సింగరేణి ఓపెన్ కాస్టుల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. అలాగే ఎన్టీపీసీ నుంచి విద్యుత్ ఉత్పత్తి సమయంలో విడుదలయ్యే ఫ్లైయాష్లోనూ ఈ మూలకాలను కనుగొన్నారన్నారు.
మణుగూరు సమీపంలోని దుర్గంగుట్ట బ్లాక్‌లో సగటున 266.21 పీపీఎం స్థాయిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు జీఎస్ఐ నిర్ధారించిందని, మొత్తంగా సింగరేణి గనుల్లో లాంథనం, సీరియం లాంటి ఆరు రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇట్రిడియం, స్కాండియం, డిస్ఫ్రోజియం లాంటి హెవీ రేర్ ఎర్త్ మూలకాల ఉనికిని గుర్తించామన్నారు.