Silver Costly | ఇక నుంచి వెండి, వెండితో తయారు చేసే ఆభరణాల ధరలు కూడా కొండెక్కనున్నాయి. వెండిపై కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి పెంచుతున్నట్లు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటి వరకు సిల్వర్ డోర్ (silver dore) పై 6.1 శాతం, సెమీ మాన్యుఫాక్చర్డ్ వస్తువులపై 7.5 శాతం పన్ను అమల్లో ఉంది. తాజాగా వెండిపై కస్టమ్స్ డ్యూటీ 10 శాతం చేసేశారు. ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం.. సిల్వర్‌తోపాటు బంగారం, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ పెంచిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్ల తయారీని ప్రోత్సహించడానికి వాటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఐదు శాతాన్ని పూర్తిగా రద్దు చేశారు.
వెండి ఆభరణాలపై కస్టమ్స్ సుంకం పెంపుపై పలు ఆభరణాల తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. వెండి ఆభరణాల ధర పెరుగుతుందని తెలిపారు. కమా జ్యువెల్లరీ ఫౌండర్ కం ఎండీ కొలిన్ షా స్పందిస్తూ బంగారం బార్లపై కస్టమ్స్ డ్యూటీ, సిల్వర్‌పై దిగుమతి సుంకం పెంచడంతో ఆభరణాల ధరలు పెరుగుతాయన్నారు. స్థానికంగా ఆభరణాల తయారీ సంస్థలు వాటికి మెరుగు పెట్టిన తర్వాత ధరలు పైపైకి దూసుకెళ్తాయన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ సైతం డ్యూటీ పెంపుతో వెండి ఆభరణాల ధరలు దూసుకెళ్తాయన్నారు.