న్యూఢిల్లీ, జనవరి 19: రోజురోజుకూ భారీగా పెరుగుతూపోతున్న వెండి ధరలు.. మరో కీలక మైలురాయిని అధిరోహించాయి. సోమవారం దేశీయ స్పాట్ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు ఏకంగా రూ.3 లక్షలను అధిగమించింది. ఢిల్లీలో ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.3,02,600 పలికింది. ఈ ఒక్కరోజే రూ.10,000 పెరిగింది. కిలో ధర ఈ నెలలో ఇప్పటిదాకా రూ.63,600 పుంజుకోవడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ 31న రూ.2,39,000 వద్ద ముగిసింది.
ఇక 2024 ముగింపుతో చూస్తే 2025 మొత్తంగా కేజీ సిల్వర్ రేటు రూ.1,49,300 ఎగిసింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచి డిమాండ్ బాగా పెరిగిందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. అలాగే మదుపరులు సైతం వెండిపట్ల ఆసక్తి చూపిస్తున్నారని, రిజర్వ్ బ్యాంకులు కూడా నిల్వలను పెంచుకుంటున్నాయని.. ఈ కారణాలు కూడా వెండి ధరలను పరిగెత్తిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలూ అంతర్జాతీయ మార్కెట్లో ధరలను ఎగదోస్తున్నట్టు వివరిస్తున్నారు.
ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,900 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,48,100గా నమోదైంది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూ.10,400 ఎగిసింది. డిసెంబర్ 31న రూ.1,37,700 వద్ద స్థిరపడింది. దీంతో ఈ వారం రూ.1,50,000 మార్కును దాటేస్తుందన్న అంచనాలైతే వినిపిస్తున్నాయి. అలాగే ఈ దూకుడును చూసి ఈ ఏడాది గోల్డ్ రేటు 10 గ్రాములు రూ.2,50,000కు చేరుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. ఫారెక్స్.కామ్ వివరాల ప్రకారం ఔన్స్ గోల్డ్ 4,690.80 డాలర్లుగా, సిల్వర్ 94.13 డాలర్లుగా ఉన్నాయి.
స్పాట్ మార్కెట్ జోరుకు తగ్గట్టుగానే ఫ్యూచర్ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఫ్యూచర్స్ ట్రేడ్‌లో తొలిసారి కిలో వెండి ధర రూ.3 లక్షల మార్కును దాటింది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై సిల్వర్ ఫ్యూచర్స్ గతంతో పోల్చితే రూ.16,438 లేదా దాదాపు 6 శాతం పెరిగి రూ.3,04,200గా ఉన్నది. గడిచిన వారం రోజుల్లో సుమారు 14 శాతం (రూ.35,037 పెరుగుదల) ర్యాలీ కనిపించింది. ఈ నెలలోనైతే కిలో వెండి రేటు రూ.68,499 వృద్ధి చెందింది. డిసెంబర్ 31న రూ.2,35,701 వద్ద స్థిరపడింది. ఇక బంగారం విషయానికొస్తే.. ఫిబ్రవరి కాంట్రాక్ట్స్కుగాను రూ.2,983 పెరిగి 10 గ్రాములు రూ.1,45,500 పలికింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాలపైనా సుంకాలు వేస్తామని హెచ్చరించడం మదుపరులను భయాందోళనలకు గురిచేసిందని ట్రేడర్లు చెప్తున్నారు. తమ పెట్టుబడుల రక్షణార్థం స్టాక్ మార్కెట్ల నుంచి గోల్డ్, సిల్వర్ వైపునకు కదులుతున్నట్టు వివరిస్తున్నారు. ఇరాన్, వెనెజువెలా దేశాలపై ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది. గ్లోబల్ మార్కెట్ కొమెక్స్లో మార్చి డెలివరీకి సిల్వర్ ఔన్స్ రికార్డు స్థాయిలో 94.35 డాలర్లు పలకడం ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరి డెలివరీకి ఔన్స్ గోల్డ్ 4,698 డాలర్లుగా ఉన్నది. మునుపటితో పోల్చితే వెండి 5.81 డాలర్లు, బంగారం 102.6 డాలర్లు పుంజుకున్నాయి. మున్ముందు మరింతగా ధరలు పెరుగుతాయన్న అంచనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర అత్యధికంగా రూ.3,03,000-3,04,000 పలికింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం బంగారం విలువ రూ.1,34,050గా ఉన్నది. కాగా, ధరల్లో స్థిరత్వం లోపించడంతో అమ్మకాలు ప్రభావితం అవుతున్నాయని నగల వ్యాపారులు అంటున్నారు. కొందరు ధరలు తగ్గుతాయన్న భావనలో ఉంటే.. మరికొందరు అత్యవసరమైతే తప్ప కొనుగోళ్లకు దిగడం లేదని వాపోతున్నారు. పెరుగుతున్న ధరల వల్ల మార్కెట్లో లావాదేవీలు భారీగా తగ్గిపోయాయని చెప్తున్నారు. చాలామంది ఇమిటేషన్ జ్యుయెల్లరీపట్ల ఆసక్తి చూపుతున్నారని పేర్కొంటున్నారు.