న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశీయ మార్కెట్లో వెండికి డిమాండ్ నానాటికీ పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హై రికార్డులను సృష్టిస్తూ ధరలు పరుగులు పెడుతున్నాయి. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో మరో రూ.1,800 పుంజుకున్నది. దీంతో కిలో రేటు మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,07,600 పలికింది. అయితే బంగారం ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,36,500గా ఉన్నది. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ గోల్డ్ తులం రూ.1,34, 840గా నమోదైంది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,23,600గా ఉన్నది.
బుధవారం ముగింపుతో చూస్తే రూ.300 ఎగిసింది. ఇదిలావుంటే ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తులం బంగారం విలువ రూ.57,550 పెరిగింది. కిలో వెండి ధర రూ.1,17,900 ఎగిసింది. గత ఏడాది డిసెంబర్ 31న బంగారం 10 గ్రాముల రేటు రూ.78,950గా, వెండి కిలో ధర రూ. 89,700గా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ గురువారం 4,325.02 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ ఔన్స్ 66.04 డాలర్లు. కాగా, ప్రపంచ ఆర్థిక అనిశ్చిత స్థితి నడుమ బంగారంతోపాటు వెండిని కూడా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటున్నాయి. ఈ పరిణామం కూడా గ్లోబల్ మార్కెట్లో రేట్లను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.