న్యూఢిల్లీ, డిసెంబర్ 11: బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో మరో రూ.2,400 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా కిలో విలువ రూ.1,94,400 పలికింది. దీంతో భారతీయ విపణిలో సరికొత్త రికార్డు నమోదైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనం కావడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేటును పావు శాతం తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్లోనూ సిల్వర్‌కు డిమాండ్ కనిపించడం వంటివి.. దేశీయ మార్కెట్లో ధరల్ని పరుగులు పెట్టించాయని నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
బుధవారం ఏకంగా కిలో రేటు రూ.11,500 పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వెండి ధర రూ.1,04,700 (116.72 శాతం వృద్ధి) పెరగడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ 31న కిలో రేటు రూ.89,700గానే ఉన్నది మరి. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి 62.88 డాలర్లుగా ఉన్నది. క్రితం రోజు ముగింపుతో చూస్తే 1.06 డాలర్లు లేదా 1.71 శాతం పెరిగింది. కాగా, సాధారణ కొనుగోలుదారులతోపాటు నాణేల తయారీదారులు, వివిధ రకాల ఇండస్ట్రీ వర్గాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు.
ఇటీవలికాలంలో మదుపరులు సైతం వెండిపై పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా సిల్వర్ రిజర్వులను పెంచుకుంటున్నాయని పేర్కొంటున్నారు. అందుకే ధరలు ఈ స్థాయిలో పెరుగుతూపోతున్నాయని అంటున్నారు. ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగితే కిలో ధర రూ.2 లక్షల మార్కును దాటడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చన్న అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు గురువారం రూ.90 పెరిగి రూ.1,32,490కి చేరిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ రేటు తులం రూ.440 అందుకుని రూ.1,30,750గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.400 పెరిగి రూ.1,19,850 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 15.55 డాలర్లు లేదా 0.37 శాతం పుంజుకొని 4,213.12 డాలర్లుగా ఉన్నది. ఈ ఏడాది అక్టోబర్‌లో దేశీయంగా బంగారం ధర రూ.1,34,800 పలికిన సంగతి విదితమే. ఇప్పటిదాకా ఇదే ఆల్‌టైమ్ హై. దేశ, విదేశాల్లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కదలాడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారం, వెండి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ధరలను అంతకంతకూ ఎగదోస్తున్నది.