Home Loans | రెండు విడతల్లో ఆర్బీఐ 90 బేసిక్ పాయింట్లు రెపోరేటు పెంచేయడం.. తదనుగుణంగా వాణిజ్య బ్యాంకులు తమ వడ్డీరేట్లు.. ప్రధానంగా ఇండ్ల రుణాలపై వడ్డీరేటు పెంచేశాయి. ఫలితంగా వడ్డీరేటు పెంపుతో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో రూ.కోటి, అంతకంటే ఎక్కువ ఇండ్ల రుణాలు తీసుకున్న వారు.. నెలవారీ రుణ వాయిదాలు చెల్లించడం భారంగా మారింది. రూ.కోటి అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలపై నెలకు రూ.12 వేల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఉదాహరణకు ఎవరైనా ముంబై మహానగరంలో రూ.2 కోట్ల రుణం తీసుకున్నారనుకోండి. ఆర్బీఐ రెపోరేట్ పెంచకముందు అంటే గత ఏప్రిల్‌లో వారి నెలవారీ రుణవాయిదా రూ.1,59,898.. మేలో రూ.1,64,807లకు, జూన్‌లో రూ.1,71,041లకు పెరిగింది. రవికృష్ణన్ అనే రుణ గ్రహీత మాట్లాడుతూ గతేడాది రూ.1.5 కోట్ల రుణం తీసుకున్నానని చెప్పాడు. ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) పెరుగుతుందని ఇటీవలే తనకు సమాచారం వచ్చిందని తెలిపాడు. ఇది తన నెలవారీ బడ్జెట్‌పై మరింత ఒత్తిడి తెస్తుందన్నాడు.
పెరిగిపోయిన వడ్డీరేట్ల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. కుటుంబ అవసరాలకు నగదు కొరత రాకుండా తొలుత రుణ గ్రహీత పెరిగిన ఈఎంఐ చెల్లించడం బెస్టంటున్నారు. అలా కానీ పక్షంలో రుణం గడువు పెంచాలని బ్యాంకర్లను కోరడమే రెండో ఆప్షన్ అని అంటున్నారు. బ్యాంకర్లు సాధారణంగా ఇంటి రుణంపై నెలవారీ వాయిదా (ఈఎంఐ)ను స్తబ్దుగా ఉంచి.. రుణం చెల్లింపు గడువు పెంచుతారు. రుణం చెల్లింపు గడువు పెంచుకోవడానికి బదులు ఈఎంఐ పెంచుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది.