ముంబై, డిసెంబర్ 10: రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు తగ్గేందుకు వీలుందన్న సంకేతాలి చ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా పదవీ విరమణ చేస్తున్న శక్తికాంత దాస్. సుదీర్ఘకాలం పాటు రెపోరేటు స్థిరంగానే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాస్ పలుకులు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఇక తన హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ మధ్య మంచి సంబంధాలే కొనసాగాయని ఆయన తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌గా మంగళవారంతో ఆయన పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గడిచిన ఆరేండ్లుగా కేంద్రం, ఆర్బీఐ నడుమ సఖ్యతతో కూడిన వాతావరణమే ఉన్నట్టు, సమన్వయంతో ముందుకెళ్లినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఇందుకు సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ఉన్నతాధికారులు, ఆర్బీఐ సిబ్బంది, వ్యాపార-పారిశ్రామిక వర్గాలు, బ్యాంకర్లకు దాస్ కృతజ్ఞతలు తెలిపారు.
క్లిష్ట పరిస్థితులు..
ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి దాస్‌కు క్లిష్ట పరిస్థితులే ఎదురయ్యాయి. 1980 తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. రిటైర్మెంట్ అనంతరం 2018 డిసెంబర్లో మూడేండ్లకుగాను ఆర్బీఐ 25వ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఊర్జిత్ పటేల్ అనూహ్య రాజీనామాతోనే మోదీ సర్కారు దాస్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే మరో మూడేండ్లు ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఈ సమయంలో కరోనా, జీడీపీ పతనం, ద్రవ్యోల్బణం విజృంభణ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ఈస్ట్ ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా 11 ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిల్లో స్థిరంగానే ఉంచారు. ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ రంగాలను డిజిటలైజ్ చేయడంలోనూ దాస్ కీలకపాత్ర పోషించారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) దిశగా కూడా అడుగులు పడ్డాయి.
అత్యధిక డివిడెండ్లు
ఊర్జిత్ పటేల్ హయాంలో కేంద్రంతో ఆర్బీఐకి దెబ్బతిన్న సంబంధాలను దాస్ పునరుద్ధరించగా.. గొడవకు కారణమైన ఆర్బీఐ మిగులు నగదు నిల్వలను సైతం చాకచక్యంగా ఖజానాకు తరలించగలిగారు. అంతేగాక తన హయాంలో కేంద్రానికి అత్యధిక డివిడెండ్లనూ ముట్టజెప్పారు. గడిచిన ఆరేండ్లలో రూ.6,61,024 కోట్లను అందించారు మరి. గత ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో రూ.2,11,000 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించారు. ఇక ఆర్బీఐకి కొత్తగా వస్తున్న గవర్నర్ సంజయ్ మల్హోత్రా అనుభవజ్ఞుడని, ఆయన సారథ్యంలో ఆర్బీఐ మరింత బలపడగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా దాస్ వ్యక్తం చేశారు. ఇదిలావుంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదనిపిస్తే దాన్నే చేస్తామని సంజయ్ మల్హోత్రా అన్నారు. బుధవారం ఆయన ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.
దాస్ ఇంకా ఏమన్నారంటే?..