ముంబై, సెప్టెంబర్ 1: కొద్దిరోజులుగా జరుగుతున్న స్టాక్స్ ర్యాలీకి బుధవారం బ్రేక్‌పడింది. ట్రేడింగ్ తొలిదశలో 57,919 పాయింట్ల రికార్డుగరిష్ఠస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్, తదుపరి లాభాల స్వీకరణ కారణంగా వెనుతిరిగింది. చివరకు క్రితం ముగింపుతో పోల్చితే 214 పాయింట్లు క్షీణించి 57,338 పాయింట్ల వద్ద ముగిసింది. రికార్డు గరిష్ఠం నుంచి దాదాపు 600 పాయింట్లు కోల్పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో తొలుత 17,225 పాయింట్ల గరిష్ఠానికి పెరిగిన అనంతరం చివరకు 56 పాయింట్ల నష్టంతో 17,076 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇటీవలి ర్యాలీతో స్టాక్స్ విలువలు బాగా పెరిగిపోయాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు కొంతమేర లాభాల్ని తీసుకున్నందున, మార్కెట్ తగ్గిందని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఆటోమొబైల్ కంపెనీలు ఆగస్టునెలకు వెల్లడించిన విక్రయ గణాంకాలు సైతం ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా మహింద్రా అండ్ మహింద్రా 2.9 శాతం క్షీణించింది. టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తగ్గిన షేర్లలో ఉన్నాయి. మరోవైపు ఆసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబ్, టైటాన్, ఎల్ అండ్ టీలు లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే మెటల్, ఐటీ, టెక్నాలజీ, బేసిక్ మెటీరియల్స్, ఫైనాన్స్ సూచీలు 1.8 శాతం వరకూ క్షీణించాయి. అయితే బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.92 శాతం వరకూ పెరిగాయి.
స్వల్పంగా తగ్గిన రూపాయి
స్టాక్ మార్కెట్ బాటలోనే ఫారెక్స్ మార్కెట్లో సైతం రూపాయి విలువ స్వల్పంగా క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ బుధవారం 8 పైసలు తగ్గి, 73.08 వద్ద ముగిసింది. దీంతో రూపాయి నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్పడినట్లయ్యింది. ఇంట్రాడేలో 72.92 స్థాయివరకూ పెరిగిన తర్వాత ఒకదశలో 73.50 వరకూ రూపాయి తగ్గింది. ముగింపులో 50పైసల నష్టం నుంచి కొంత కోలుకోగలిగింది. విదేశీ మార్కెట్లలో డాలరు ఇండెక్స్ బలపడిన కారణంగా రూపాయి తగ్గిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.