ముంబై, ఏప్రిల్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను 90 రోజులపాటు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరినప్పటికీ పెట్టుబడిదారులు ఈ విషయాలను పట్టించుకోలేదు. కేవలం కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇరు సూచీలు రెండు శాతం వరకు లాభపడ్డాయి. ఇంట్రాడేలో 1,600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి 1,310.11 పాయిం ట్లు లేదా 1.77 శాతం అందుకొని 75,157.26 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 429.40 పాయింట్లు లేదా 1.92 శాతం ఎగబాకి 22,828.55కి చేరుకున్నది.
రూ.7.85 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగరడంతో మదుపరుల ఎగిరి గంతేశారు. వీరి సంపద రూ.7.85 లక్షల కోట్లు అధికమైంది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.7,85,135.29 కోట్లు ఎగబాకి రూ.4,01,67,468.51 కోట్ల(4.66 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. సూచీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా 2.33 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
సోమవారం మార్కెట్లకు సెలవు
బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్లు మూసివేసివుంచనున్నారు.