Stock Markets | ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ, వడ్డీరేట్ల పెంపుతో వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అంచనాలు, కరోనాను నియంత్రించడానికి చైనాలో మళ్లీ లాక్డౌన్లు తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం ట్రేడింగ్‌లో అద్యంతం అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 844 పాయింట్ల నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 వేల మార్క్ దిగువకు పడిపోయింది. రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాలు గడించిన టీసీఎస్, ఇన్ఫోసిస్ ప్రతిపాదించిన షేర్ల బై బ్యాక్ ప్లాన్ ఇన్వెస్టర్లను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాయి. ట్రేడింగ్ ముగియడానికి ఒక గంట ముందు పూర్తిగా ఇన్వెస్టర్లు చేతులెత్తేయడంతో ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి.
మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈలో కొద్దిసేపు సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో సెన్సెక్స్ 58,028 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అటుపై ట్రేడింగ్ ముగిసే వరకు ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయరు. దీంతో ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 978 పాయింట్ల పతనంతో 57,050 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ట్రేడింగ్ ముగింపు సమయానికి 844 పాయింట్లు పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్.. గత మూడు సెషన్లలో 1075 పాయింట్లు నష్టపోయింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 వేల మార్క్‌కు పతనమైంది. 258 పాయింట్ల నష్టంతో నిఫ్టీ-50 16,984 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా 2.5, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో రెండు శాతం చొప్పున నష్టాలకు గురయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 3.7 శాతం నష్టపోయింది. నెస్ట్లే ఇండియా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) భారీగా నష్టపోగా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఒక శాతం చొప్పున లాభాలతో ముగిశాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 1.5 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ రెండు, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్, రియాల్టీ ఇండెక్స్‌లు 2-3 శాతం మధ్య నష్టాలతో ముగిశాయి. ఇక ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌పై రూపాయి మారకం విలువ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.82.37 వద్ద స్థిర పడింది.