Sensex Losses | అంతర్జాతీయ బలహీనతల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుధవారం ఇన్వెస్టర్లు రిస్క్‌లు ఉన్న స్టాక్స్ విక్రయానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 168 పాయింట్ల పతనంతో 59,029 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17,624 పాయింట్ల వద్ద స్థిర పడింది.
భారీగా నష్టపోయిన స్క్రిప్ట్‌ల్లో టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ నిలిచాయి. వీటి స్టాక్స్ ఒక శాతం నుంచి 2.6 శాతం మధ్య పతనం అయ్యాయి. మరోవైపు శ్రీ సిమెంట్, అల్ట్రా టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, బీపీసీఎల్ స్క్రిప్ట్‌లు ఒకశాతానికి పైగా లాభాలతో ముగిశాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం లాభ పడ్డాయి. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ ఒక శాతానికి పైగా నష్టపోగా, ఫార్మా సూచీ 0.8 శాతం లాభంతో ముగిసింది. ఐపీవోకు వెళ్లిన తమిళ్నాడ్ మర్కంటైల్ బ్యాంక్ మూడో రోజు, చివరి రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 2.7 రెట్లు ఎక్కువ సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఆరు రెట్లు, ఎన్ఐఐలు 2.68 రెట్లు, క్యూఐబీలు 1.6 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు.