Sensex | వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటన శుక్రవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లు భారీగా సర్దుబాట్లకు దిగడంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్ అండ్ టీ షేర్ల ప్రభావం పూర్తిగా ఇండెక్సులపై పడింది. బీఎస్ఈ-30 సెన్సెక్స్ 1176.46 పాయింట్లు నష్టపోయి 78,041.59 (1.49 శాతం) పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో 79,587.15 పాయింట్ల నుంచి 77,874.59 పాయింట్ల మధ్య తచ్చాడింది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 364.20 (1.52 శాతం) పాయింట్ల నష్టంతో 23,587.50 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో24,065.80 పాయింట్ల నుంచి 24,537.15 పాయింట్ల వద్ద స్థిర పడింది.
నిఫ్టీ-50లో 45 స్టాక్స్ నష్టాల్లోనే ముగిశాయి. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ట్రెంట్ తదితర స్టాక్స్ 3.90 శాతం తగ్గాయి. రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్, నెస్లె ఇండియా, హెచ్డీఎప్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు పుంజుకునన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 2.82 శాతం, స్మాల్ క్యాప్ -100 2.19 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ సెలెక్ట్ టెలికం, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ వరకూ3 శాతం వరకూ.. నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీయస్యూ బ్యాంకు రెండు శాతం వరకూ నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్-30లో 27 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు షేర్లు నాలుగు శాతం వరకూ పతనం అయ్యాయి. నెస్లే ఇండియా, టైటాన్ షేర్లు లాభ పడ్డాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 2.1, బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.43 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 72 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం 2621 డాలర్లు పలికింది.