Stocks | యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ పావెల్ జెరోమ్ నర్మగర్భ వ్యాఖ్యల ఫలితంగా అంతర్జాతీయ, జాతీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. కేవలం రెండు సార్లు మాత్రమే వడ్డీరేట్ల కోత ఉంటుందని ఫెడ్ రిజర్వ్ పేర్కొన్నది. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీల్లో షార్ప్ కరెక్షన్ చోటు చేసుకుంది. ఫలితంగా రెండు సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు 25 బేసిక్ పాయింట్లు తగ్గించినా, భవిష్యత్లో ఏమైనా జరుగొచ్చునన్న సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఫలితంగా బీఎస్ఆ-30 ఇండెక్స్ సెన్సెక్స్ టేడింగ్ ముగిసే సమయానికి 965.15 (1.20 శాతం) పాయింట్లు కోల్పోయి, 79,218.07పాయింట్ల వద్ద నిలిచింది. అంతర్గత ట్రేడింగలో 79,516.70 పాయింట్ల నుంచి 79,218.05 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య తచ్చాడింది.మరోవైపు, ఎస్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50.. 247.15 పాయింట్లు నష్టంతో 23,951.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో 24,004.90 పాయింట్ల నుంచి 23,870.30 పాయింట్ల మధ్య తచ్చాడింది.
ఎన్ఎస్ఈలో 36 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్ తదితర స్టాక్స్ 2.33 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్, సన్ ఫార్మా, అపొలో హాస్పిటల్ తదితర 14 స్టాక్స్ 4.04 శాతం వరకూ లబ్ధి పొందాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 0.28, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 0.51 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఫార్మా, హెల్త్ కేర్ లాభాలతో స్థిర పడ్డాయి. మరోవైపు బ్యాంక్ స్టాక్స్, ఐటీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్ తదితర ఇండెక్సులు ఒక శాతం చొప్పున నష్టపోయాయి.
సెన్సెక్స్-30లో సన్ ఫార్మా, హిందూస్థాన్ యూనీ లివర్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభ పడ్డాయి. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ పైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు పతనం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2635 డాలర్లు పలికితే, బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఇక ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్టం రూ.85.08 వద్ద స్థిర పడింది.