Stocks | అంతర్జాతీయ బలహీన సంకేతాల నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 450.94 పాయింట్లు పతనమై 78,248.13 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్‌లో 79,092.70 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 78,077.13 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య తచ్చాడింది. మరోవైపు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 168.50 పాయింట్లు నష్టంతో 23,644.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నిఫ్టీ 23,915.35 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23,618.90 పాయింట్ల మధ్య ట్రేడయింది. బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్టాక్స్‌తో సూచీలు పతనం అయ్యాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) షేర్లు పతనం అయ్యాయి. మరోవైపు, జోమాటో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్ పార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లబ్ధి పొందాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ నాలుగు పైసలు నష్టంతో రూ.85.52 వద్ద స్థిర పడింది. మరోవైపు, అంతర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారెల్ 73.98 డాలర్లు, ఔన్స్ బంగారం 2625 డాలర్లు పలికింది.
బేర్’ చూపులతో ఎన్ఎస్ఈ-50లోని 50 స్టాక్స్ లో 38 నష్టాల్లోనే ముగిశాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, టాటా మోటార్స్, ట్రెంట్, విప్రో తదితర సంస్థలు 2.32 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, శ్రీరాం ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ సహా 11 స్టాక్స్ 7.26 శాతం వరకూ లాభ పడ్డాయి. బ్రాడర్ మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.37 శాతం లబ్ధి పొందగా, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇండెక్స్ 0.62 శాతం పతనమైంది. వివిధ సెక్టార్ల ఇండెక్సుల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్సియల్స్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్స్, నిఫ్టీ రియాల్టీ తదితర ఇండెక్స్‌లు 1.87 శాతం వరకూ నష్టపోగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ టెలికం ఇండెక్స్‌లు 1.62 శాతం వరకూ లాభ పడ్డాయి.