న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఒక్కరోజు విరామానంతరం బుల్స్ తిరిగి జోరు చూపించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 58,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. ఈ సూచి 514 పాయింట్లు పెరిగి 57,853 పాయింట్ల కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం ఇదేబాటలో 17,200 పాయింట్లపైన ముగియడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సూచి 158 పాయింట్లు ర్యాలీచేసి 17,234 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగినట్లు ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టీసీఎస్ 3.34 శాతం పెరిగి రూ.3,800పైన ముగిసి రికార్డు సృష్టించింది. హిందుస్థాన్ యూనీలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, నెస్లే ఇండియా, కొటక్ బ్యాంక్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీలు లాభపడిన షేర్లలో ఉన్నాయి. మరోవైపు మహింద్రా అండ్ మహింద్రా 2.2 శాతం మేర నష్టపోయింది. సెమికండక్టర్ల కొరత కారణంగా 25 శాతం ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఈ కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో షేరు తగ్గింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఆసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీలు కూడా తగ్గాయి. రంగాలవారీగా బీఎస్ఈ ఎఫ్ఎంసీజీ, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ, బేసిక్ మెటీరియల్స్, రియల్టీ సూచీలు 1.56 శాతం వరకూ పెరిగాయి. ఆటోమొబైల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టాలతో ముగిసాయి. ఇటీవల వెల్లడవుతున్న ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా వుండటం, దేశంలో వ్యాక్సినేషన్లు వేగవంతంకావడంతో చిన్న కరెక్షన్ తర్వాత మార్కెట్లు మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో పడ్డాయని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. కొద్ది రోజులుగా రిటైల్ ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్స్ మార్కెట్లో కొనుగోళ్లు జరుపుతుండగా, మూడు రోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారీగా కొంటున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
2.53 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద…
తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.2,53,613 కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,52,68,939 కోట్లకు పెరిగింది. ఇది రికార్డు.