ముంబై, ఆగస్టు 7: ఐటీ షేర్లు ర్యాలీ జరపడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ పెరిగింది. గత శుక్రవారం 480 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం మరో 232 పాయింట్లు జతచేసి 65,953 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేరీతిలో క్రితం ట్రేడింగ్ రోజున 135 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ తాజాగా మరో 80 పాయింట్లు లాభపడి 19,597 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ధోరణితో ట్రేడవుతున్నా, ఐటీ, ఫార్మా షేర్లు దేశీయ సూచీలకు దన్నుగా నిలిచాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అయితే 10న ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నందున, మార్కెట్ లాభాలు పరిమితంగా ఉన్నాయని వివరించారు.
ఎం అండ్ ఎం అప్
జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాల్ని వెల్లడించిన మహింద్రా అండ్ మహింద్రా సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా 4.2 శాతం మేర లాభపడింది. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ 3.25 శాతం పెరగ్గా, తాజాగా ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన ఎస్బీఐ షేరు 2.94 శాతం నష్టపోయింది. పెరిగిన షేర్లలో సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, విప్రో, మారుతి సుజుకిలు ఉన్నాయి. మరోవైపు ఎస్బీఐ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహింద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే బీఎస్ఈ హెల్త్‌కేర్ ఇండెక్స్ అత్యధికంగా 1.61శాతం పెరిగింది. టెలికమ్యునికేషన్స్ సూచి 1.28 శాతం, ఐటీ ఇండెక్స్ 1.07 శాతం, టెక్నాలజీ సూచి 0.91 శాతం,రియల్టీ ఇండెక్స్ 0.63 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 0.32 శాతం చొప్పున పెరిగాయి. ఎఫ్ఎంసీజీ 0.85 శాతం, కమోడిటీస్ సూచి 0.56 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీస్, బ్యాంకెక్స్, మెటల్, పవర్ ఇండెక్స్‌లు నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం, మిడ్‌క్యాప్ సూచి 0.56 శాతం చొప్పున లాభపడ్డాయి.