ముంబై, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన 2021 సంవత్సరానికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఉదయం ఆరంభం నుంచే సూచీలు లాభాల జోరును ప్రదర్శించాయి. ఈ క్రమంలోనే మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేయడంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 459.50 పాయింట్లు లేదా 0.80 శాతం ఎగిసి 58,253.82 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 150.10 పాయింట్లు లేదా 0.87 శాతం ఎగబాకి 17,354.05 వద్ద నిలిచింది. అయితే అక్టోబర్ రికార్డు స్థాయిలతో పోల్చితే 6 శాతానికిపైగా తగ్గుముఖం పట్టాయి. ఇక సెన్సెక్స్ షేర్లలో టైటాన్ షేర్ విలువ అత్యధికంగా 3.5 శాతం లాభపడింది. కాగా, ఏడాదంతా ఎన్నో ఒడిదుడుకులకు సూచీలు లోనైనా.. రికార్డుల మోతే మోగించాయి. 2020 మార్చిలో నమోదైన నష్టాల స్థాయితో చూస్తే సెన్సెక్స్ 140 శాతం, నిఫ్టీ 145 శాతం పుంజుకున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు వచ్చిపడిన లాక్‌డౌన్‌తో 2020 మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా నాలుగేండ్ల కనిష్ఠానికి పతనమైన విషయం తెలిసిందే.
2021లో చిన్న షేర్లు మదుపరులకు పెద్ద ఎత్తున లాభాలను అందించాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 62.76 శాతం లేదా 11,359.65 పాయింట్లు ఎగిసింది. ఇదే సమయంలో మిడ్‌క్యాప్ సూచీ 39.17 శాతం లేదా 7,028.65 పాయింట్లు పెరగగా, సెన్సెక్స్ 21.99 శాతం లేదా 10,502.49 పాయింట్లు పుంజుకున్నట్లు స్టాక్ ఎక్సేంజ్ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 19న ఈ మూడు సూచీలు మునుపెన్నడూ లేని గరిష్ఠ స్థాయిలను తాకడం విశేషం. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 30,416.82 పాయింట్లకు, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 27,246.34 పాయింట్లకు, సెన్సెక్స్ (లార్జ్‌క్యాప్ ఇండెక్స్ లేదా బ్లూచిప్ షేర్లు) 62,245.43 పాయింట్లకు చేరాయి. దీంతో కొత్త సంవత్సరంలోనూ చిన్న షేర్లు అదరగొట్టేస్తాయన్న అంచనాలు భారీగా వినిపిస్తున్నాయి. వచ్చే 2-3 ఏండ్లలో స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు ఆకర్షణీయంగా ఉంటాయన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 2020లోనూ స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు 24.30 శాతం మేర లాభాలను అందించాయి. మదుపరులకు సెన్సెక్స్ 15.7 శాతం రిటర్న్స్‌ను ఇచ్చింది. కరోనా నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా ఉండటంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా చిన్న షేర్లలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నట్టు నిపుణులు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు.
పెరిగిన మదుపరుల సంపద 2021లో మదుపరుల సంపద గణనీయంగా పెరిగింది. కరోనా ప్రతికూల పరిస్థితులున్నా.. బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ దాదాపు రూ.78 లక్షల కోట్లు ఎగిసింది. రూ.77, 96,692.95 కోట్లు పెరిగి రూ.2,66,00,211.55 కోట్లకు చేరింది. అక్టోబర్ 18న రికార్డు స్థాయిలో రూ. 2,74,69,606.93 కోట్లను తాకడం గమనార్హం. కాగా, 2020లో రూ.32,49,689.56 కోట్లు ఎగబాకి బీఎస్ఈ మదుపరుల సంపద రూ.1,88,03,518.60 కోట్ల వద్ద ఉన్నది.