Stocks | దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ నష్టాల నుంచి ట్రేడింగ్ ముగిసే సమయానికి కోలుకుని లాభాలతో ముగిశాయి. ఆటో, మెటల్ స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినా, దేశీయ మదుపర్లు స్థిరంగా కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 253 పాయింట్ల లబ్ధితో 73,917 పాయింట్ల వద్ద ముగిస్తే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 22,466 పాయింట్ల వద్ద స్థిర పడింది.
ఈ వారంలో 13 సెక్టోరల్ ఇండెక్సుల్లో 12 ఇండెక్స్‌లు 0.5-6.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ఫిబ్రవరి రెండో తేదీతో ముగిసిన వారం తర్వాత ఇండెక్స్‌లు లాభాలతో ముగియడం ఇదే తొలిసారి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆరు శాతం పుంజుకోగా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రా టెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, మారుతి సుజుకి స్టాక్స్ ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. మరోవైపు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే, విప్రో నష్టాలతో స్థిర పడ్డాయి.
అమెరికా ఫెడ్ రిజర్వ్ ఆధారిత ఐటీ స్టాక్స్ నష్టంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.85 శాతం నష్టంతో ముగిసింది. మరోవైపు నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.7 శాతం ఆల్ టైం గరిష్టానికి పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బాలక్రుష్ణ ఇండస్ట్రీస్, టీవీ మోటార్ పుంజుకున్నాయి. ఇదిలా ఉంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.65 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం లాభాలతో ముగిశాయి.