ముంబై, డిసెంబర్ 1: ఒమిక్రాన్ భయాలతో ఇటీవల వరుస పతనాల్ని చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం కొంతవరకూ రికవరీ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 620 పాయింట్ల లాభంతో 57,685 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 184 పాయింట్లు ర్యాలీ జరిపి 17,167 పాయింట్ల వద్ద నిలిచింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో స్థానిక ఇన్వెస్టర్లు…కనిష్ఠస్థాయిల్లో లభ్యమవుతున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎనర్జీ షేర్లను జోరుగా కొనుగోలు చేసారు. రూపాయి విలువ పెరుగుదల, ప్రోత్సాహకర క్యూ2 జీడీపీ డాటాతో కూడా సెంటిమెంట్ బలపడిందని ట్రేడర్లు చెప్పారు. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.31 లక్షల కోట్లు పెరగడం మార్కెట్లో జోష్ నింపింది. ఒమ్రికాన్ వేరియంట్ ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా, దేశీ గణాంకాలు తాత్కాలిక ఊరటనిచ్చాయని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ 5.7 శాతం పెరిగింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు 2-4 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, భారతి ఎయిర్టెల్, టైటాన్, కొటక్ బ్యాంక్‌లు స్వల్పంగా నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ మెటల్, ఎనర్జీ, బ్యాంకెక్స్, ఆటో, ఫైనాన్స్ ఇండెక్స్‌లు 2.40 శాతం వరకూ పెరిగాయి.