Stocks | అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో రెండు రోజుల పాటు లాభాలు గడించిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వు తీసుకునే నిర్ణయం మీద అందరూ దృష్టిని కేంద్రీకరించడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 836.34 పాయింట్ల పతనంతో 79,541.79 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్ లో ఒకానొక దశలో 958.79 పాయింట్ల మేర నష్టపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 284.70 పాయింట్లు నష్టపోయి 24,199.35 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా నష్టపోగా, ఎస్బీఐ మాత్రమే లాభాలతో ముగిసింది. బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,445.59 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్ -100 ఇండెక్స్ 0.67, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ మెటల్ 2.54 శాతం, యుటిలిటీస్ 1.82 శాతం, కమోడిటీస్ 1.40 శాతం, రియాల్టీ 1.45 శాతం, పవర్ 1.42 శాతం, ఆటో 1.40 శాతం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈలో 2,134 స్టా్క్స్ నష్టాలతో, 1821 స్టాక్స్ లాభాలతో స్థిరపడగా, 98 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి. గ్లోబల్ బెంచ్ మార్క్ క్రూడాయిల్ 0.33 శాతం తగ్గి 74.67 డాలర్లు పలికింది.