Stocks | దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రెండు రోజుల లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ రోజంతా ఒడిదొడుకులను ఎదుర్కొంటూ చివరకు నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నేపథ్యంలో రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ స్టాక్స్ పతనం అయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు కూడా నిధులు ఉపసంహరించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 329.92 పాయింట్లు (0.43శాతం) నష్టంతో 76,190.46 పాయింట్ల వద్ద ముగిసింది.ఇంట్రాడే ట్రేడింగ్‌లో 428.63 పాయింట్ల పతనంతో 76,091.75 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 113.15 పాయింట్ల పతనంతో 23,092.20 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ అండ్ టర్బో, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్ తదితర స్టాక్స్ ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు, హిందూస్థాన్ యూనీ లివర్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర స్టాక్స్ లాభ పడ్డాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాలతో ముగిస్తే, టోక్యో మార్కెట్ నష్టాలతో స్థిర పడింది. గురువారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.5,462.52 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 0.27శాతం పుంజుకుని 78.50 డాలర్లు పలికింది.