Stock Market | కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారి జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు దన్నుగా నిలువడంతో సెన్సెక్స్ మరోసారి 74వేల మార్క్‌ను తాకింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 73,968.62 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించాయి. 74,254.62 పాయింట్ల గరిష్ఠానికి చేరుకొని ఆల్‌టైమ్ హైకి చేరింది. ఇంట్రాడేలో 73,909.39 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 36.20 పాయింట్ల లాభంతో 74,014.55 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం అదే రోజును కొనసాగించింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే 22,455.00 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది.
ఇంట్రాడేలో 22,529.95 పాయింట్లకు పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. చివరకు 135.10పాయింట్లు పెరిగి.. 22,462 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 3,015 షేర్లు పురోగమించగా, 572 షేర్లు క్షీణించాయి. 112 షేర్లు మారలేదు. నిఫ్టీలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఐషర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో, ఎల్టీఐమిండ్ట్రీ, నెస్లే నష్టపోయాయి. ఆటో మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు మెటల్, పవర్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, రియల్టీ 1-4 శాతం వృద్ధితో లాభాల్లో ముగిశాయి. ఆయిల్, గ్యాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంక్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 3 శాతం లాభపడ్డాయి.