Stocks | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2025-26 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్‌గా ముగిశాయి. శనివారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా.. తిరిగి నష్టాల్లోకి పడిపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ స్వల్పంగా 5.39 పాయింట్లు లాభంతో 77,505.96 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో 77,899.05 పాయింట్ల గరిష్టానికి చేరుకుని.. తిరిగి 77,006.47 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 26.25 పాయింట్ల లబ్ధితో 23,482.15 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో 23,632.45 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. తిరిగి 23,318.30 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది.
బీఎస్ఈ-30లో జొమాటో ఏడు శాతానికి పైగా లబ్ధి పొందగా, ఐటీసీ హోటల్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర స్టాక్స్ లాభ పడ్డాయి. మరోవైపు పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్నష్టాలతో ముగిశాయి. శుక్రవారం వరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,188.99 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. గ్లోబల్ క్రూడాయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌పై 0.29 శాతం తగ్గి 76.67 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది.