ముంబై, అక్టోబర్ 16: స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ పోతుండటంతో ఐటీ, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా ప్రారంభంలో లాభపడిన సూచీలు మధ్యాహ్నాం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలను మరింత పెంచాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 318 పాయింట్లు నష్టంతో 81,501.36 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 25 వేల మార్క్‌ను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 86.05 పాయింట్ల నష్టంతో 24,971.30 వద్ద ముగిసింది. కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలకు తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధిలో అంచనాలను తగ్గించడం మదుపరుల్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నిఫ్టీ వరుసగా రెండోరోజు నష్టాల్లోకి జారుకున్నదని…అమెరికా సూచీలు కదంతొక్కినప్పటికీ ఆసియా, యూరప్ సూచీలు నష్టపోవడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు.