ముంబై, మార్చి 9: దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇంధన సెగ గట్టిగానే తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బుసలుకొడుతుండటంతోపాట గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న నిస్తేజం కారణంగా సూచీలు భారీగా పతనం చెందాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు కుప్పకూలడంతో దలాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. గత వారం రోజులుగా నష్టాలే పరమావదిగా సాగుతున్న సూచీలపై ఆసియా మార్కెట్లు, క్రూడాయిల్ బాంబు పడింది. దీంతో ఇంట్రాడేలో మూడు శాతానికి పైగా నష్టపోయిన సూచీలు చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగాయి.
ఒక దశలో 2,400 పాయింట్ల వరకు నష్టపోయినా 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,352.74 పాయింట్లు లేదా 1.71 శాతం నష్టపోయి 77,566.16 వద్ద స్థిరపడింది. నేటి మార్కెట్లో 3,379 షేర్లు నష్టపోగా, 972 షేర్లు లాభాల్లో ముగిశాయి. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 422.40 పాయింట్లు లేదా 1.73 శాతం నష్టపోయి 24,028.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 752 పాయింట్లు కోల్పోయి తన కీలక మైలురాయి 24 వేల స్థాయిని కోల్పోయింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత ముదురుతుండటంతో మదుపరుల నష్టాలకు ఆజ్యంపోశాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.