ముంబై, అక్టోబర్ 9: దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత స్టాక్ మార్కెట్‌కు మరో వార్ దెబ్బ తగిలింది. ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య యుద్ధం తలెత్తడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ స్టాక్ సూచీలు సోమవారం పతనమయ్యాయి. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ముగిసిన శనివారం గాజా స్ట్రిప్ నుంచి పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ గ్రూప్ హమాస్ హఠాత్తుగా ర్యాకెట్ దాడులు జరపడంతో ఇజ్రాయిల్‌లో 1000కి పైగా పౌరులు మృతిచెందడంతో హమాస్‌పై ఇజ్రాయిల్ వార్ ప్రకటించింది. దీంతో క్రూడ్ ధరలు, అమెరికా డాలర్ భారీగా పెరిగాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు పతనాన్ని చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు క్షీణించి 65,512 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 141 పాయింట్లు తగ్గి 19,512 పాయింట్ల వద్ద నిలిచింది. డాలర్ ఇండెక్స్ 106.3 స్థాయికి చేరగా, బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 88 డాలర్ల స్థాయికి ఎగిసింది. మరోవైపు బంగారం ధర సైతం ప్రపంచ మార్కెట్లో 20 డాలర్ల మేర పెరిగి 1,865 డాలర్ల వద్దకు చేరింది.
27 సెన్సెక్స్ షేర్లు నష్టాల్లోనే
సెన్సెక్స్-30 షేర్లలో 27 షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. మూడు మాత్రమే గ్రీన్‌లో నిలిచాయి. అదే నిఫ్టీ-50లో 43 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 2.05 శాతం తగ్గింది. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్లు 1-2 శాతం మధ్య క్షీణించాయి. ఐటీ దిగ్గజాలు ట్రెండ్‌కు భిన్నంగా 1.02 శాతం, 0.47 శాతం చొప్పున లాభపడగా, ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనీలీవర్ సైతం గ్రీన్‌లో క్లోజయ్యింది.
చిన్న షేర్లు కుదేలు
తాజా మార్కెట్ పతనంలో చిన్న షేర్లకు గట్టి దెబ్బ తగిలింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గరిష్ఠంగా 1.72 శాతం పతనంకాగా, మిడ్‌క్యాప్ సూచి 1.22 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.84 శాతం చొప్పున తగ్గాయి. వివిధ రంగాలవారీగా చూస్తే కమోడిటీ ఇండెక్స్ 1.30 శాతం, బ్యాంకెక్స్ 1.04 శాతం చొప్పున పడిపోయాయి. ఆటోమొబైల్ ఇండెక్స్ 0.95 శాతం, రియల్టీ 0.92 శాతం, హెల్త్‌కేర్ 0.31 శాతం మేర తగ్గాయి. టెక్నాలజీ, ఐటీ ఇండెక్స్‌లు స్వల్పంగా నష్టపోయాయి.
రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి
తాజా పతనంతో ఒకేరోజున రూ.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.319.9 లక్షల కోట్ల నుంచి రూ.3.9 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.316 లక్షల కోట్లకు పడిపోయింది.