సెన్సెక్స్ 1,223 పాయింట్లు జంప్
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు
ముంబై, మార్చి 9: ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా ర్యాలీ జరిపింది. అంతర్జాతీయ సంకేతాలు సైతం సానుకూలంగా ఉండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1,223 పాయింట్ల లాభంతో 54,647పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి 24 తర్వాత సెన్సెక్స్ ఇంత భారీగా పెరగడం ఇదే ప్రధమం. అలాగే వరుసగా రెండో రోజు లాభపడింది. ఇదేరీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 332 పాయింట్లు పెరిగి 16,345 పాయింట్ల వద్ద నిలిచింది. నాటో సభ్యత్వం కోసం పట్టుపట్టబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షడు ప్రకటించారన్న వార్తలతో దలాల్ స్ట్రీట్ బుల్స్ కదం తొక్కారని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రంగనాథన్ తెలిపారు. అలాగే యూరప్ మార్కెట్లు లాభపడటం, అమెరికా స్టాక్ ఫ్యూచర్లు పెరగడంతో దేశీ సూచీలు ర్యాలీ జరిపాయని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. రూపాయి విలువ పుంజుకోవడం, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర కాస్త శాంతించడం కూడా స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్‌ను మెరుగుపర్చింది. డాలరు మారకంలో రూపాయి విలువ ఒక్కసారిగా 44 పైసల మేర పెరిగింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర 132 డాలర్ల స్థాయి నుంచి 125 డాలర్ల వద్దకు తగ్గింది. రష్యా-ఉక్రెయిన్ అనిశ్చితి తొలిగేంతవరకూ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా హెచ్చరించారు. అలాగే గురువారం వెలువడనున్న వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారన్నారు.
దన్నుగా రిలయన్స్ …
మార్కెట్ ర్యాలీకి హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహించింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఏషియన్ పెయింట్స్ 5.64శాతం పెరిగినప్పటికీ, ఇండెక్స్‌లో ఉన్న అధిక వెయిటేజీ కారణంగా రిలయన్స్ ఎక్కువ పాయింట్లను జతచేసింది. ఈ షేరు 5.24 శాతం పెరిగింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్లు 4-5 శాతం మధ్య పెరిగాయి. ఐటీ షేర్లలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లు 2-3 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, నెస్లే ఇండియా, విప్రో షేర్లు స్వల్పంగా తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2.37 శాతం మేర పెరిగాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, రియల్టీ, ఆటోమొబైల్ సూచీలు 3.58 శాతం వరకూ ఎగిసాయి.
కోలుకున్న రూపాయి
44 పైసలు లాభపడ్డ కరెన్సీ
ముంబై, మార్చి 9: దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు ర్యాలీ చేయడం, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు చల్లబడటంతో రూపాయి విలువ కోలుకున్నది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ ఒక్కసారిగా 44 పైసలు పెరిగి 76.56 వద్ద ముగిసింది. క్రితం రోజు ఇది రికార్డు కనిష్ఠస్థాయి 77 సమీపంలో ముగిసిన సంగతి తెలిసిందే. టర్కీలో ఉక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రులు గురువారం జరపనున్న సమావేశంలో ప్రస్తుత యుద్ధానికి తెరపడుతుందన్న ఆశాభావంతో రూపాయి పుంజుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు.
రూ.7.21 లక్షల కోట్లు పెరిగిన సంపద
తాజా మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద భారీగా రూ.7.21 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.7,21,950 కోట్లు అధికమై రూ.2,48,32,781 కోట్లకు చేరింది.